ఆక్వా వేసవి సాగులో అప్రమత్తం
ఉష్ణోగ్రతుల పెరుగుదల ఆక్వా పై తీవ్ర ప్రభావం చూపుతుంది .ఈ నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు మేలని మత్య్సశాఖ నిపుణులు సూచిస్తున్నారు.ఉమ్మడి జిల్లాలో 1.80 లక్షల ఎకరాల్లో చేపలు ,1.10 లక్షల ఎకరాల్లో రొయ్యల సాగు చేస్తున్నారు .మొత్తం 2.90 లక్షల ఎకరాల విస్తీర్ణంలో ఆక్వా సాగు జరుగుతుంది .వార్షిక ఉత్పత్తి 4 లక్షల టన్నులు కాగా ..వార్షిక టర్నోవర్ రూ .18 వేల కోట్లకుపైనే ..ప్రభుత్వానికి అధిక ఆదాయం తీసుకొచ్చే ఆక్వారంగం వేసవిలో నష్టాల పాలవుతుంది .నీటి కొరత ,హెచ్చు ఉష్ణోగ్రతులతో చేపలు ,రొయ్యలు వ్యాధుల బారినపడుతున్నాయి .వేసవిలో ఆక్వా రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కాకినాడకు చెందిన విశ్రాంత ఫిషరీస్ డిప్యూటీ డైరెక్టర్ పి .రామ్మోహనరావు వివరించారు .
రొయ్యల ,చేపల పెరుగుదల 28-32 డిగ్రీల ఉష్ణోగ్రత దగ్గర బాగుంటుంది .వేసవిలో నీటి ఉష్ణోగ్రత గణనీయంగా పెరిగి 35 డిగ్రీలు దాటుతుంది .ఈ పరిస్థితులలో నీటిలో ప్రాణవాయువు కరిగే శక్తీ తగ్గుతుంది .అధిక ఉష్ణోగ్రతులవల్ల కొన్ని చెరువులలో (ముఖ్యంగా లోతు ఎక్కువున్న చెరువులలో )నీటి లెవెల్స్ 3 అంతస్తులుగా వేరుపడుతుంది .దీనివల్ల చెరువు పైపొరలలో డీవో ఎక్కువగా ,అడుగు పొరలలో డీవో తక్కువగా వుంటూ చేపలు ,రొయ్యలకు ఇబ్బంది కలిగిస్తోంది .చెరువు నీటిలో అనవసరమైన ,హానికారక శైవాలాలు కూడా ఏర్పడతాయి .అధిక శైవలాల వల్ల నీటి పీహెచ్ పెరుగుతుంది .నీటి ఉష్ణోగ్రత ,పీహెచ్ అధికంగా ఉన్నప్పుడు అమ్మోనియా స్థాయి పెరిగి రొయ్యలు ,చేపలకు ఒత్తిడి కలిగించి వ్యాధులకు దారి తీస్తోంది .చిరు చేపలు ,రొయ్యలు అధిక నీటి గుణాల తారతమ్యాలు తట్టుకోలేవు .
మేత యాజమాన్యం
వేసవిలో అధిక ఉష్ణోగ్రతలకు రొయ్యలు ,చేపలు ఎక్కువ మేత తింటాయి .ఎక్కువ ఉష్ణోగ్రతల వద్ద (33 డిగ్రీలు దాటితే ),ఎక్కువ మేతను తీసుకున్నా రొయ్యలలో పెద్దగా కనబడదు .రైతులు మేత యాజమాన్యం సరిగా చేయాలి .చేపలకు ఒక్కసారే మేత ఇస్తారు .అది ఉదయం 8 గంటల తర్వాత ఇవ్వడం మంచిది .రొయ్యలకు 4-5 సార్లు ఇచ్చే ఆహారం చెక్ ట్రేని బట్టి ఇవ్వాలి .
వ్యాధుల నివారణ ఇలా
వేసవిలో చేపలకు ,రొయ్యలకు వివిధ రకాల వ్యాధులు వస్తాయి .వాటిని ఎప్పటికప్పుడు గమనిస్తూ ,తగిన జాగ్రత్తలు తీసుకోవాలి .చేపలలో శంకు జలగ ,రెడ్ డిసీజ్ ,ఇతర బ్యాక్టీరియా వ్యాధులు ,పేను వంటి పరాన్న జీవుల వ్యాధులు వ్యాపిస్తాయి .రొయ్యలలో శరీరం వంపు తిరగడం వైట్ గట్ ,వైట్ పీసెస్ ,వైట్ మజిల్ ,రన్నింగ్ మోర్టాలిటీ ,విబ్రియో వంటి బాక్టీరియా విజృంభిస్తుంది .చెరువులో పెంచే చేప ,రొయ్యలకు ఏ విధమైన ఒత్తిడి కలిగించకుండా చర్యలు చేపట్టాలి .
పెరుగుతున్న ఉష్ణోగ్రతులతో రైతుల ఆందోళన
చుట్టుముడుతున్న వ్యాధులు
ముందస్తు జాగ్రత్తలు మేలంటున్న మత్స్య విభాగ నిపుణులు
వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు
చెరువు నీటి లోతు కనీసం 1.5 మీటర్లు ఉండాలి
నీటిలో ఏరియేటర్లకు క్రమపద్ధతిలో అమర్చి తిప్పుకోవాలి .
నీటిలో డీవో స్థాయి తగ్గితే సర్దుబాటు కోసం హైడ్రోజన్ పెరాక్సైడ్ ,కాల్షియం పెరాక్సైడ్ వంటి రసాయనాలు అందుబాటులో ఉంచుకోవాలి .
వారం వారం రొయ్యల మేతను చెక్ ట్రే ఆధారంగా లెక్కించి అవసరమైతే పెంచాలి.
అనవసరంగా చెరువులో ఎరువులు వాడకూడదు .
వ్యాధులకు అనుగుణంగా రసాయనాలు ,ప్రోబయోటిక్స్ అందుబాటులో ఉంచుకోవాలి .
కొత్తగా చెరువులో రొయ్య సీడ్ వేసే వారు ,ముందుగా సీడ్ (రొయ్య పిల్ల )ని చెరువు వాతావరణానికి అలవాటు చేసి వదలండి .దీని వల్ల నెంబర్ తగ్గకుండా నిలబడుతుంది .