వనామి.. కష్టాల సునామి
అంతర్జాతీయ మార్కెట్ లో నిలకడ లేని ధరల వల్లనే కాదు.. అనధికార హేచరీల నుంచి వస్తున్న నాసిరకం రొయ్య పిల్లలు ..సిండికేట్ గా మారిన మేత కంపెనీలు ఇష్టానుసారం ధరలు పెంచేయడం ..వెరసి వనామి రైతులు నిలువునా మునుగుతున్నారు .ఆక్వా రైతులు ఎదురు దెబ్బలు తినడానికి ఈ సీడ్ ,ఫీడ్ కారణమవుతున్నాయి .వీటి వల్ల నష్టాలను మూటకట్టుకుంటున్న వనామి రైతులు మరోసారి సాగుకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడుతుంది .
ఉమ్మడి తూర్పుగోదావరి పరిధిలోని కాకినాడ ,డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాల్లో వరి ,కొబ్బరి ,అరటి ,కూరగాయల పంటల తర్వాత ఆక్వా సాగు పెద్ద ఎత్తున జరుగుతుంది .వనామి రొయ్యల సాగుకు పెట్టుబడులు ,లావాదేవీలు అధికం .ఈ రంగం దేశానికి పెద్ద మొత్తంలో విదేశీ మారక ద్రవ్య్యాన్ని సైతం తెచ్చిపెడుతుంది .అటువంటి వనామి సాగు ఇప్పుడు సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది .ఈ ఏడాది ఆరంభంలో ధరలు పెరగటంతో ఆక్వా సాగు ఆశాజనకంగా కనిపిచింది .అంతలోనే ఎగుమతిదారులు సిండికేట్ గా మారి ధరలు తగ్గించడం ..అమెరికా సుంకాల ప్రభావం ..ఎడాపెడా విద్యుత్ కోతలతో పెరిగిన పెట్టుబడులు ..ఇలా చెప్పుకుంటూపోతే వనామి రైతుల కష్టాలకు అంతే లేకుండా పోతుంది .వీటన్నింటికన్నా రొయ్యల మేత (ఫీడ్ ) ధరలు ,నాసిరకం రొయ్య పిల్లల (సీడ్) వల్ల వీరు అధికంగా నష్టపోతున్నారు .
వారిది దురాశ.. వీరికి నిరాశ
దేశంలోనే 12 తీర ప్రాంతాల్లో 302 హేచరీలు ,21 బ్రూడ్ స్టాక్ హేచరీలు మాత్రమే కోస్టల్ ఆక్వా కల్చర్ అథారిటీ (సిఏఏ) రిజిస్ట్రేషన్ పొందాయని సమాచారం .చాలా ప్రాంతాల్లో .. ముఖ్యంగా కాకినాడ కోనసీమ జిల్లాల్లో రొయ్య పిల్లల ఉత్పత్తి కేంద్రాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి .కాకినాడ జిల్లా యు .కొత్తపల్లి,తుని ,తొండంగి,తాళ్లరేవు మండలాల్లో 100కు పైగా హేచరీలను సిఏఏ అనుమతి లేకుండా అనాధికారికంగా నిర్వహిస్తున్నారు .కోనసీమ జిల్లా అల్లవరం , ఐ .పోలవరం,కాట్రేనికోన ,మలికిపురం మండలాల్లో మరో 50కి పైగా ఉన్నాయి . వనామి సాగులో అధిక దిగుబడులు సాధించాలంటే నాణ్యమైన రొయ్య పిల్లలు కావాలి.కానీ , చాలా వరకు నాసిరకం కావడంతో నెల రోజుల్లోపు విబ్రియో ,ఈహెచ్ పి ,వైట్ స్పాట్ ,వైట్ గట్ ,వైట్ ఫికల్ ,రెడ్ డిసీజ్ వంటి వ్యాధులు ప్రబలి రొయ్య పిల్లలు మృత్యువాత పడుతున్నాయి .ఈహెచ్ పి సోకిన రొయ్యల్లో 60 రోజులు గడిచిన పెద్దగా పెరుగుదల ఉండదు .ఒక రొయ్య 2 గ్రాములు ,మరొకటి 5 గ్రాములు ఇలా వేర్వేరు బరువుతో ఉంటాయి .ఒకవైపు మంచి కౌంట్ రాకపోవడం ,మరోవైపు మేత వృధా పోవడంతో రైతులు నష్టపోతున్నారు .చాలా వరకు అనధికార హేచరీల్లో వ్యాధులున్న బ్రూడర్ (తల్లి )రొయ్యలను కొనుగోలు చేసి ,వాటి పిల్లలను అమ్మతున్నారు .ఆరోగ్యకరమైన బ్రూడర్ రొయ్యలున్నా వాటి నుంచి ఏడు ధపాలుగా మాత్రమే పిల్లలను ఉత్పత్తి చేయాల్సి ఉంది.కానీ హేచరీల యజమానులు అత్యాశకు పోయి 12 నుంచి 15 ధపాలుగా రొయ్య పిల్లలను ఉత్పత్తి చేస్తున్నారు .దీని వల్ల వాటిలో వ్యాధి నిరోధక శక్తీ తగ్గి ,త్వరగా వ్యాధుల బారిన పడుతున్నాయి .దీనితో ,పెట్టుబడి పెరిగి ,తగినంతగా లాభాలు రాక వనామి రైతులు నిరాశ చెందుతున్నారు .
టన్నుకు రూ .25 వేలు పెంచి ..
కరోనా సమయంలో టన్ను సోయాబీన్ ధర అంతర్జాతీయంగా రూ .90 వేలకు చేరింది .దీంతో ,ఆక్వా ఫీడ్ ఉత్పత్తిదారులు రాత్రికి రాత్రే మేత ధరను టన్నుకు రూ .25 వేలకు పైగా పెంచారు .తరువాత కాలంలో సోయాబీన్ ధర టన్ను రూ .25 వేలకు తగ్గింది .ప్రస్తుతం రూ .40 వేలుగా ఉంది .అయినప్పటికీ మేత కంపెనీలు ధరలు తగ్గించడం లేదు .మేతలో వాడే మినరల్స్ ,ఇతర పదార్థాలపై కస్టమ్స్ డ్యూటీ 15 శాతం ఉండగా ..వాటిని కూడా ఎత్తేసారు .ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకుంటే టన్ను మేతను రూ .25 వేల నుంచి రూ .30 వేలు తగ్గించి విక్రయించారు .కానీ ,మేత ఉత్పత్తిదారులు దిగి రాబోమని అంటున్నారు .దీనివల్ల రైతులు నష్టపోయే పరిస్థితి నెలకొంది .వనామి రొయ్యల చెరువుల్లో వినియోగించే మందులపై కూడా 150 శాతంగా ఉన్న కస్టమ్స్ డ్యూటీని కూడా తగ్గించారు .అయినప్పటికీ వాటి ధరలను కూడా తగ్గించడం లేదు .రొయ్యల కౌంట్ ధరల నష్టాల కన్నా మేత ,రొయ్య పిల్లలు ,మందుల వల్ల అధికంగా నష్టపోతున్నామని రైతులు వాపోతున్నారు .
నాణ్యత లేని సీడ్ తో నష్టం
నాసిరకం రొయ్య పిల్లల వల్ల రైతులు పలు రకాలుగా నష్టపోతున్నారు .అవి చాలా
త్వరగా వ్యాధులు బారిన పడుతున్నాయి .చిన్న వయసులోనే చనిపోవడం వల్ల రైతులు కనీస పెట్టుబడులు కూడా పొందలేకపోతున్నారు .ఒకవేళ బతికినా రొయ్యల కౌంట్ల మధ్య వ్యత్యాసం అధికంగా వస్తోంది .దీనివల్ల మార్కెట్లో సరైన ధరలు పొందలేక రైతులు నష్టపోతున్నారు .ప్రభుత్వం స్పదించి ,మత్య్సశాఖ ద్వారా హేచరీలపై నిఘా పెట్టి ,రైతులకు నాణ్యమైన రొయ్య పిల్లలు అందించేలా చర్యలు తీసుకోవాలి .
- పి .రామ్మోహనరావు ,రిటైర్డ్ అసిస్టెంట్ డైరెక్టర్ ,స్టేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్