సిండికేట్ల రొయ్యో
ఏళ్లుగా ఆక్వా సాగు చేస్తున్న రైతుల పరిస్థితి దయనీయంగా మారింది .మార్కెట్ను ఎక్స్ పోర్ట్ చేస్తున్న ప్రోసెసింగ్ కంపెనీలు శాసిస్తున్నాయి .రొయ్యల ధరలు ఇష్టమొచ్చినట్లుగా తగ్గించేస్తున్నారు .ఫీడు ధరలు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి .అన్నీ తలుచుకుని ఆక్వా రైతులు విలవిల్లాడుతున్నారు .గిట్టుబాటు ధర రాక సతమతమవుతున్నారు .ట్రంప్ సుంకాల పేరు చెప్పి ఎగుమతిదారులు అడ్డగోలుగా ధరలు తగ్గించేయడంతో పరిస్థితి మరింతగా దిగజారుతోంది .కంపెనీలు చెల్లిస్తున్న ధరలు తమకు ఏమాత్రం గిట్టుబాటు కావని ఆవేదన చెందుతున్నారు.
జిల్లాలో 14 వేల ఎకరాల్లో ఆక్వా సాగవుతోంది .అందులో 12 వేల ఎకరాల్లో టైగర్ రొయ్య ,రెండు వేల ఎకరాల్లో వనామి రకాన్ని సాగు చేస్తున్నారు .ప్రస్తుతం వేసవి సాగు చేపట్టారు .నెల రోజుల నుంచి సాగుతో ఆక్వా రైతులు ముమ్మరంగా ఉన్నారు .మంచి ధరలు ఉండడంతో దాదాపు 30 టన్నుల సీడ్ ను తీసుకొచ్చి సాగు ప్రారంభించారు .ప్రారంభంలో మంచి ధరలు ఉన్నా సాగు ప్రారంభమయ్యాక రేట్లు పతనమయ్యాయి .ఇక మార్కెట్లో ఫీడ్ ధరలు తగ్గినా కంపెనీలు మాత్రం తగ్గించకపోవడం ,సొయా ధరలు భారీగా తగ్గినా కేవలం రూ .3 లు తగ్గించటంతో రైతుకు ఎలాంటి ప్రయాజనం చేకూరడం లేదు .
20 రోజుల్లో భారీగా పడిపోయిన ధరలు :
టైగర్ రొయ్యల ధరలు 20 రోజుల్లో భారీగా పడిపోయాయి .సాగు ప్రారంభానికి ముందు వరకు 20 కౌంట్ టైగర్ రొయ్యలు కిలో రూ .680 వరకు ధర పలికింది .ట్రంప్ టారిఫ్ ,వ్యాపారులు సిండికేట్ కావడంతో ఒక్క సారిగా కిలోకు రూ .100 తగ్గిపోయింది .ప్రస్తుతానికి ట్రంప్ టారిఫ్ సుంకం లేకపోయినా సిండికేట్ వ్యాపారులు ఏమాత్రం పెంచటం లేదు .దాంతో ఒక్కో రైతు లక్షల్లో నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది .ప్రస్తుతం పెరిగిన లీజు ,ఫీడ్ ,విద్యుత్ చార్జీలతో 100 కౌంట్ కు రావాలంటే కిలోకు రూ .220-రూ .250 వరకు ఖర్చవుతుంది .అదే 50 కౌంట్ కు చేరాలంటే కిలోకు రూ .330-రూ .350 వరకు ,గరిష్టంగా 30కౌంట్ కు రావాలంటే కిలోకు రూ .450-రూ .490 ఖర్చు అవుతుంది .మరి 20 కౌంట్ కు రావాలంటే కిలోకు రూ .500లకు పైనే వ్యయం అవుతుంది .ఎకరా సాగుకు సీడ్ ,సాగుకు అవసరమైన హెల్త్ కేర్ మినరల్స్ ,కరెంటు చార్జీలు ,కూలి ఖర్చులు అన్ని కలుపుకుని సుమారు రూ .7 లక్షల వరకూ ఖర్చవుతుంది .ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ధరల ప్రకారం రైతుకు కష్టకాలమనే చెప్పాలి .రానున్న రోజుల్లో ధరలు మరింత పతనం అయ్యే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్న నేపథ్యంలో రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని తెలుస్తోంది .