Page:
  1. 1
  2. 2

రొయ్య ఎగుమతులకు లేబులింగ్

ఒంగోలు టౌన్:  భారతదేశం నుంచి విదేశాలకు ఎగుమతి అవుతున్న రొయ్య ఏ ప్రాసెసింగ్ యూనిట్ నుంచి వచ్చింది. ఏ ప్రాంతానికి చెందిన రైతు ఆ రొయ్యను సాగు చేశారో ఇక నుంచి తేలనుంది. ఇప్పటి వరకు ప్రాసెసింగ్ యూనిట్ల ద్వారా రొయ్యలను చైన్నైకి తరలించి అక్కడ నుంచి విదేశాలకు ఎగుమతి చేసేవారు. అయితే దేశం నుంచి ఎగుమతి అవుతున్న రొయ్యల్లో కొంత శాతం నిషేధిత  యాంటీబయోటిక్స్ ఉండటంతో ఎగుమతులపై ప్రభావం చూపిస్తోంది. ఈ నేపధ్యంలో నిషేధిత  యాంటీబయోటిక్స్ ఏ ప్రాంతం నుంచి వచ్చాయి. ఏ రైతు వాటిని వాడారో గుర్తించేందుకు రొయ్య ఎగుమతులకు తాజాగా లేబులింగ్ సిస్టంను ఏర్పాటు చేయనున్నారు. దీనివల్ల రొయ్యల్లో నిషేధిత  యాంటీబయోటిక్స్ వాడుతున్న రైతులను గుర్తించి  వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసేందుకు లేబులింగ్ సిస్టం దోహదపడనుంది. తద్వారా నాణ్యమైన రొయ్యలను విదేశాలకు ఎగుమతి చేసేందుకు వీలు కలగనుంది.
20 నుంచి 50 శాతం శాంపిల్స్ సేకరణతో అప్రమత్తం:
భారతదేశం నుంచి విదేశాలకు ఎగుమతి అవుతున్న రొయ్యల కంటైనర్ లో శాంపిల్స్ సేకరణను పెంచేశారు.గతంలో ప్రతి కంటైనర్ లో  20 శాతం మాత్రమే శాంపిల్స్ పరిశీలించేవారు అయితే దీని వల్ల నిషేధిత  యాంటీబయోటిక్స్ సరిగా గుర్తించలేకపోతున్నారు. మొక్కుబడిగా శాపింల్స్  సేకరించి విదేశాలకు రవాణా చేయడంతో నిషేధిత  యాంటీబయోటిక్స్ ఉన్నట్లు గుర్తించడంతో అసలుకే మోసం వచ్చినట్లయింది. ఈ నేపధ్యంలో భారతదేశం నుంచి ఎగుమతి చేసే రొయ్య కంటైనర్లలో 50 శాతం శాంపిల్స్ సేకరించాలని నిర్ణయించారు. ఈ నేపధ్యంలో క్షేత్ర స్ధాయిలోనే రొయ్య ఉత్పత్తులపై నిఘా పెట్టాలని  , అందులో భాగంగా విదేశాలకు ఎగుమతి చేసే రొయ్యలకు లేబులింగ్ సిస్టం  అమలు చేయాలని తీర ప్రాంత రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. లేబులింగ్ విధానం వల్ల ఏ రైతు నుంచి  ఉత్పత్తులు వచ్చాయో తెలుసుకొని అతనిపై ఆంక్షలు విధించేందుకు కూడా వెనకాడకుండా ఉండేలా చర్యలు చేపట్టింది.
జిల్లాలో ఏటా 36 వేల టన్నుల ఉత్పత్తి:  జిల్లాలో ఏటేటా పెరుగుతూ ఉంది. ఏటా రెండు క్రాప్లు వేస్తున్నారు. అన్ని రకాలుగా పరిస్ధితులు అనుకూలిస్తే రొయ్య రైతులకు పెట్టిన పెట్టుబడికి రెట్టింపు ఆదాయం వస్తోంది. అయితే కొతమంది రైతుల అత్యాశ మిగిలిన రైతులపై కూడా ప్రభావం చూపిస్తోంది. జిల్లాలో ప్రస్తుతం 6 వేల హెక్టార్లల్లో రొయ్యల చెరువులు ఉన్నాయి దాదాపు 3500మంది రైతులు ఈ చెరువులను వేస్తున్నారు. మొదటి క్రాప్ కింద దాదాపు 24 వేల టన్నుల రొయ్యలు చెరువుల్లో నుంచి  తీస్తుంటారు .రొయ్యలు ఎక్కువగా ఉత్పత్తి అవుతుండటంతో కొంతమంది  రైతులు అత్యశకు వెళ్ళి అనర్ధాలను కొని తెచ్చుకుంటున్నారు. రెండవ విడత క్రాప్ కు సంబంధించినతక్కువ టన్నుల్లో రొయ్యలు వస్తున్నప్పటికి మొదటి క్రాప్ మాదిరిగా రావాలని ఉద్దేశంతో విచ్చల విడిగా నిషేధిత  యాంటీబయోటిక్స్ వాడుతున్నారు. అయితే  వాటిలో నిషేధిత  యాంటీబయోటిక్స్ ఉన్న విషయాన్ని రైతులు గుర్తెరకుండా  చెరువుల్లో నుంచి ఎన్ని టన్నుల రొయ్యలు వస్తాయా అని లెక్కలు వేసుకోవడంలో నే నిమగ్నం అవుతున్నారు. చెరువుల్లో నుంచి తీసిన రొయ్యలను ప్రాసెసింగ్ యూనిట్లకు తరలిస్తున్నారు. రాష్ట్రంలోని కాకినాడ , విశాఖ పట్నంల తో పాటు చైన్నై నుంచి విదేశాలకు రొయ్యలను ఎగుమతి చేస్తూ ఉంటారు. రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న రొయ్యల్లో 95 శాతం రైతులు ఎగుమతి చేస్తూ ఉంటారు .యూరోపియన్ యూనియన్ కు సంబంధించిన 10 దేశాలు భారత్ నుంచి రొయ్యలను దిగుమతి  చేస్తుంటారు. ముఖ్యంగా  జపాన్ , అమెరికాకు భారత్ నుంచి  ఎక్కువగా రొయ్యలను ఎగుమతి చేస్తూ ఉంటారు. అయితే భారత్ నుంచి  వచ్చే రొయ్యల్లో నిషేధిత  యాంటీబయోటిక్స్ ఉన్నట్లు తేలడంతో కంటైనర్లు వెనక్కి వస్తున్నాయి. ఇలాంటి పరిస్ధితుల్లో అమలు చేయనున్న లేబులింగ్ సిస్టం  ద్వారా రైతులు అప్రమత్తంగా ఉండి నాణ్యమైన రొయ్య ఉత్పత్తి చేసేందుకు వీలు కలగనుంది.
Source: sakshi