Page:
  1. 1
  2. 2

ఐదేళ్లలో ఆక్వా ఉత్పత్తులను వందశాతం పెంచుతాం

అమరావతి సుదీర్ఘమైన సముద్రతీరప్రాంతం ఉన్న జిల్లాల్లో ఆక్వా రంగంలో లక్ష్యాన్ని మించి ప్రగతి నమోదవుతోంది. 2015-16 ఆర్థిక సంవత్సరంలో వర్షాభావ పరిస్థితులతో ప్రతికూల వాతావరణంలోనూ లక్ష్యాలను అధిగమించారు. ఐదేళ్లలో ఆక్వా ఉత్పత్తులను వందశాతం పెంచాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఆక్వా సాగుదారులకు అనేక రాయితీలు అందిస్తోంది. నూతన మత్స్యవిధానం ప్రకటించి ప్రోత్సాహం అందిస్తోంది. విద్యుత్తును రాయితీపై సరఫరా చేస్తోంది. ఆక్వారంగంలో మౌలిక సమస్యలపైన దృష్టిపెట్టిన ప్రభుత్వం అసైన్డు భూముల్లోనూ సాగుకు అనుమతించింది. ఒక్కొక్కటిగా సమస్యలు పరిష్కరిస్తున్న ప్రభుత్వం ఉత్పత్తుల పెంపునకు కార్యాచరణ ప్రణాళికలను అమలుచేస్తోంది. కృష్ణా జిల్లాలో ఉత్పత్తి చేస్తున్న ఆక్వా ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేసి మార్కెట్‌ విస్తృతి పెంచడానికి ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. సముద్రతీర ప్రాంతంలో మౌలిక వసతులు మెరుగుపరచి ఎగుమతులకు అనుకూలంగా ఆక్వా ఉత్పత్తులను ప్రాసెసింగ్‌ చేయడానికి ఏర్పాట్లు చేస్తోంది. ఎంపెడా, ఎన్‌ఎఫ్‌డీబీ సహకారంతో ప్రాసెసింగ్‌ యూనిట్లు, మౌలికవసతుల కల్పనకు నిధులు వెచ్చిస్తోంది. ఆక్వారంగం ప్రాధాన్యతను గుర్తించిన ప్రభుత్వం నిధుల కేటాయింపును పెంచింది. రైతులకు ప్రోత్సాహకాలతోపాటు తక్కువ విస్తీర్ణంలో అధిక ఉత్పత్తులు సాధించేలా రైతులకు శిక్షణ ఇస్తోంది. 250 హెక్టార్లను క్లస్టర్‌గా ఏర్పాటుచేసి ప్రత్యేకంగా సాంకేతిక సిబ్బందిని నియమించింది.సాగులో సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని అక్కడికక్కడే పరిష్కరించే దిశగా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటున్నారు. నాణ్యమైన ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేసే దిశగా ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. నాణ్యమైన రొయ్య పిల్లలను రైతులకు అందించాలనే ఉద్దేశంతో బాపట్లలో రూ.20కోట్లతో హేచరీని ఏర్పాటుచేస్తున్నారు.