Page:
  1. 1
  2. 2

ఆనందో ‘ రొయ్య ‘

రొయ్యల రైతులకు శుభవార్త ! కొన్నాళ్లుగా కరోనా వైరస్ ను బూచిగా చూపి ఆక్వారైతులను దోచుకుంటున్న కొనుగోలు కంపెనీలు, దళారులకు చెక్ పెడుతూ మెరైన్ ప్రొడక్ట్స్క్ట్ ఎక్స్ పోర్ట్ డెవలప్మెంట్  అధారిటీ సరికొత్త నిర్ణయం తీసుకొంది . ఇకపై అంతర్జాతీయ మార్కెట్ కనుగుణంగా రొయ్యల ధరలను రోజూ ప్రకటించనుంది. ఆ ప్రకారం కొనుగోలుకు వీలు కల్పించనుంది. మన రాష్ట్రం నుంచి జపాన్, అమెరికా, యూరప్ దేశాలకు రొయ్యలు ఎగుమతి అవుతాయి. వీటిని దళారులు కొనుగోలు చేసి ఎగుమతి సంస్ధలకు విక్రయిస్తారు.కరోనాను అవకాశంగా తీసుకొని రొయ్యల ఎగుమతులు సన్నగిల్లాయంటూ కంపెనీలు , దళారులు కౌంటును బట్టి కిలోకు రూ. 50 -90 తగ్గించి ధరకే కొనుగోలు చేస్తున్నారు. విధిలేని పరిస్ధితుల్లో దళారులకు తెగనమ్ముకుని ఆక్వా రైతులు భారీగా నష్టపోతున్నారు.ఆంధ్రప్రదేశ్ లో 60 వేల హెక్టర్లలో వెనామీ, 1500 హెక్టార్లలో టైగర్ రొయ్యలసాగు జరుగుతోంది.వీటి నుంచి ఏటా  ఐదు లక్షల టన్నులకు పైగా రొయ్యల ఉత్పత్తి అవుతోంది.దేశం మొత్తం మీద ఉత్పత్తయ్యే  రొయ్యల్లో 70 శాతంవాటా ఆంధ్రప్రదేశ్ దే. ఆ తర్వాత స్ధానాల్లో పశ్చిమ బెంగాల్ , ఒడిశా, గుజరాత్ ,తమిళనాడు , కేరళ ,కర్నాటక రాష్ట్రాలున్నాయి. రాష్ట్రంలోఉత్పత్తయిన రొయ్యల్లో 90 శాతానికి పైగా ఇతర దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. భారత్ నుంచి 2018-2019 లో 6,13,738 టన్నులఎగుమతులు జరగ్గా , 2019 -20 లో 6,68,710 టన్నులు ఎగుమతులు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. కృష్టా జిల్లాలో 45,812 హెక్టార్లలో ఆక్వా సాగు ఉంది. దాదాపు 15,571 మందిరైతులు ఈసాగుపై ఆధారపడి జీవనం సాగుస్తున్నారు.
కొనుగోలు కంపెనీల కుమ్మక్కు 
కరోనా వంకతో ఎగుమతి కంపెనీలు, కొంతమంది దళారులు రొయ్యల ధరలను తగ్గించి కొనుగోలు చేయడం వల్ల నష్టపోతున్నామని రైతులు కొన్నాళ్లుగా ఆవేదన చెందుతున్నారు.ఈ నేపధ్యంలో మత్స్యశాఖ , ఎంపెడా రంగంలోకి దిగాయి. దళారుల ప్రచారంలో నిజం లేదని , కరోనాకు , ఎగుమతులకు సంబంధం లేదని స్పష్టం చేశాయి.ఇకపై ఆయా దేశాలు కొనుగోలు చేసే ధరలను ప్రతిరోజూ ప్రకటించడానికి ఎంపెడా ముందుకొచ్చింది.దీని వల్ల రైతు కంపెనీ మోసాల నుంచి బయట పడవచ్చని , రైతులు తొందరపడి దళారులకు తక్కువ ధరలకు విక్రయించకుండా వేచి చూడాలని సూచించింది. దీనిపై గురువారం విశాఖపట్నంలో ఆక్వా రైతు ప్రతినిధులు , మత్స్యశాఖ అధికారులతో ఎంపెడా సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసింది.
source:sakshi